Jagathguru Bhodalu Vol-5        Chapters        Last Page

గీతలలో యోగత్రయం

గీతలో కృష్ణపరమాత్మ అర్జుననకు చేసిన ఉపదేశాలు పరస్పరవిరుద్ధంగాకనిపిస్తవి. స్వధర్మాన్ని అనుష్ఠించవలసిందనీ, కర్మలనాచరించవలసిందనీ, అనేక పర్యాయములుపదేశించారు. 'తస్మాత్‌ యుధ్యస్వ భారత' కాబట్టి అర్జునా! నువ్వు యుద్ధం చేయవలసిందని, 'కురు కర్మైవ తస్మాత్‌ త్వం' కాబట్టి కర్మాచరణం చేయుమనీ, 'కార్యం కర్మ కరోతి యః' ఎవడు చేయదగిన కర్మ చేస్తాడో అనీ, 'నిత్యం కురు కర్మ త్వం' నిత్యమూ కర్మనాచరింపుమనీ, 'యజ్ఞార్థాత్‌ కర్మణోన్యత్ర' యజ్ఞంకొరకు కర్మ చేయుమనీ, (ఇచట యజ్ఞమనగా ఈశ్వరుడని గ్రహించాలి)-ఇలా అనేక ప్రదేశములం దుపదేశించారు. తుది అధ్యాయములో 'స్వే స్వే కర్మణ్యభిరతాః సంసిద్ధిం లభ##తే నరాః' ఎవరి స్వకర్మ వారు చేసితీరవలెనన్నారు. ఈవాక్యములవల్ల భగవంతుడు కర్మయోగాన్నే అర్జునున కుపదేశించినట్లు స్పష్టమవుతున్నది. గీతారహస్యమనే కర్మయోగమందు శ్రీ లోకమాన్య తిలక్‌ కర్మయోగమే గీతోపదేశసర్వస్వ మని అభిప్రాయం వెలిబుచ్చారు.

గీతలలో ఇంకొకచోట ''నైవ కుర్వన్‌ న కారయన్‌'' చేయుట, చేయించుట తగదనే ఉపదేశం కనుపిస్తున్నది. 'రహసి స్థితః ఏకాకీ' ఏ కాంతమందు ఒంటరిగా ఉండవలసిందని మరో ఉపదేశంకూడా ఉంది గీతలలోనే. వీటివల్ల కర్మాచరణం నిరాకృతమైనట్లు కనిపిస్తుంది. కర్మయే ప్రధానంగా చెప్పినప్పుడు భక్తి జ్ఞానములు అంగములుగా చెబుతారు. కృష్ణపరమాత్మ. అట్లే భక్తినిగానీ, జ్ఞానముగానీ ప్రధానంగా చెప్పేటప్పుడు తక్కిన రెంటినీ అంగములుగా చెపుతారు. ఈ వివిధోపదేశములకు ఏక వాక్యతను ఆచార్య శంకరులు తమ భాష్యంలో కల్పించారు.

''యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతం,

స్వకర్మణా త మభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః''

అనే శ్లోకంలో ఉత్తరార్ధాన్ని వ్యాఖ్యానిస్తూ, ఇచట సిద్ది అనగా అవ్యవహితమోక్షం కాదనీ, చిత్తశుద్ధీ, యోగసిద్ధి మాత్రమేనని. ఇవి జ్ఞానసాధన మవుతువనీ (జ్ఞాననిష్ఠాయోగ్యతా లక్షణాం సిద్ధిమ్‌) అర్ధంచెప్పారుఆచార్యులవారు. కర్మలవల్ల చిత్తశుద్ధీ, యోగంవల్ల ఏకాగ్రతా కలిగి బ్రహ్మజ్ఞానానికి సాధనా లవుతాయన్నారు. కామకలుషితమయి ఏకాగ్రతలేని మనస్సునందు జ్ఞానజ్యోతి ప్రవేశింపజాలదన్నారు.

భక్తికూడా కర్మవలెనే జ్ఞానసాధన మాత్రమే అవుతుంది. ''భక్త్యా మా మభిజానతి యావాన్‌ యశ్చాస్మి తత్త్వతః'' భక్తివల్ల నానాత్వం పరిపూర్ణంగా తెలియబడదన్నారు. భగవంతుడు భక్తికి నామరూపగుణకల్పనం అవసరమవుతుంది. కనుక ఆ కల్పనచే పరమాత్మతత్వం పరిమితి కాక తప్పదు. అట్ఠిభక్తికి పరమేశ్వరానుగ్రహమే ఫలం. ఆ యనుగ్రహంవల్ల పరబ్రహ్మతత్త్వంఅవగతమవుతుంది. (తతో మాం తత్వతో జ్ఞాత్వా) ఆ జ్ఞానంవల్ల భక్తుడు పరమాత్మయందు లయమును పొందుతాడు. ''విశ##తే తదనంతరం'' అంటున్నది గీత. నీటిలోవేసిన మంచుగడ్డ కరిగి నీటితో కలిసిపోయినట్లు, సముద్రాన్ని పొందిన నదులు సముద్రమే అయిపోయినట్లు, పరమాత్మయందు లయంపొందినభక్తుడు అభేదమునుపొందుతాడని తాత్పర్యం. తదనంతర మనే మాటవల్ల వ్యవధానంగా అని గ్రహించగూడదు, వెంటనే అంతరంలేకుండా అద్వయభావం పొందుతాడని గ్రహించవలసివుంటుంది.

కాబట్టి ఈ కర్మ-భక్తి-జ్ఞాన యోగములు అధికారి తారతమ్యాన్నిబట్టి ఉపదేశింపబడినవి, కర్మాభిరతివల్ల భక్తి, భక్తి వల్ల జ్ఞానమూ కలుగుతవి. అర్జునుడు విషాదయోగంలో పడియున్నాడు గనుక మందుగ శ్రీకృష్ణు డాతనికి కర్మయోగాన్ని ఉపదేశించారు. విషణ్ణచిత్తునకు చెప్పవలసిన దప్పటికి అంతే. కనుక, భగవంతుడు ముందు కర్మను ఉపదేశించవలసి వచ్చింది.


Jagathguru Bhodalu Vol-5        Chapters        Last Page